అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా రాష్ట్రం
– డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
సంక్షేమంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం నరసన్నపేట మండలం బొరిగి వలసలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. రూ.17.50 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణదాస్ మాట్లాడుతూ అవినీతి లేని సుపరిపాలనను అందించడంలో సీఎం జగన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రైతులకు రైతుభరోసా అందించడమే కాకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పంపిణీ ధాన్యం కొనుగోలు వంటివాటిని నిర్వహిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడంలో ముందున్నారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకూ చేపట్టలేనంత స్థాయిలో పేదలకు ఇళ్లు, జగనన్న కాలనీల నిర్మాణాన్ని సాగిస్తున్నారని చెప్పారు. ఏ రంగం తీసుకున్నా నభూతో: నభవిష్యతి అనే విధంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. మూడేళ్ల కాలంలోనే 95 శాతానికి పైగా హామీలను అమలు చేశారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్నా సంక్షేమ పథకాలను అమలుచేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అన్నీ నెరవేరుస్తున్నారనీ కృష్ణ దాస్ చెప్పారు.