కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలి
టెక్కలి: కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి దృష్ట్యా కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లారకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి నూతన భవనంలో ఏర్పాటుచేసిన వి ఆర్ ఎల్ డి ల్యాబ్ ను పరిశీలించారు. కరోనా పరీక్షలు జరిపేందుకు ల్యాబ్ వైద్య సిబ్బంది నియామకం, రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం,తదితర వివరాలను డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డా, లీలాను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించామని, రోజుకు రెండువేల కరోనా పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి తరహా టెక్కలి ల్యాబ్ లో కూడా రోజుకు ఐదు వేల నుండి వేల వరకు పరీక్షలు జరిగేలా సామర్ధ్యాన్ని దశలవారీగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివలన ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం ప్రాంతాల ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, సమయం ఆదాతోపాటు త్వరగా కరోనా పరీక్షల ఫలితాలను తెలియజేయవచ్చునని అన్నారు. కరోనా టెస్టులు సంఖ్య పెంచి త్వరగా ఫలితాలను తెలిపేందుకు ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈనెల 26వ తేదీన నూతన జిల్లా ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నందున నిర్మాణ పనులను, మౌలిక వసతులు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వినియోగం వంటివాటిపై సంబంధిత ఏపీఎమ్ఎస్ఐడిసి ఈ ఈ ప్రసాద్ ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికి వరకు ఆసుపత్రికి అవసరమైన నిర్వహణ పనులు, తాగునీరు, ఆక్సిజన్ సరఫరా పైపులైన్లు పూర్తి చేసి వినియోగానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ల్యాబ్, విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని సిద్ధం చేసి 26న అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.