జిల్లాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర పరిశీలక బృందం సభ్యులు ఆదివారం ఎచ్చెర్ల మండలంలోని పలు ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా జర్జాం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన మోడల్ ట్యాంక్ పనులను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు అశోక్ పంకజ్, పి సింహాచలంలు మోడల్ ట్యాంకు ఏ ఉద్దేశంతో నిర్మించారు, నిర్మాణ పనులు ఏ విధంగా చేపట్టారు అనే విషయాన్ని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మా రావును అడిగి తెలుసుకున్నారు. గతంలో వ్యర్ధ పదార్థాలతోను, పూడికతో ఉండి నీటినిల్వ సామర్థ్యం పూర్తిగా కోల్పోయిన ఈ చెరువు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, గ్రామ ప్రజల కోరిక మేరకు మోడల్ ట్యాంకుగా అభివృద్ధి చేసేందుకు అంచనాలు తయారుచేసి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టామని డ్వామా పిడీ తెలిపారు. ప్రస్తుతం ఈ మోడల్ ట్యాంకులో పూర్తిస్థాయిలో నీరునిల్వ ఉండడంతో పాటు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పిడి కూర్మా రావుతో పాటు పంచాయితీ సర్పంచ్ తదితరులు వివరించడంతో కేంద్ర బృందం సభ్యులు ఉపాధిహామీ అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. ఇటువంటి పనులు చేపట్టడం వలన ప్రజలకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉపాధి హామీ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందని కేంద్ర బృందం సభ్యుడు అశోక్ పంకజ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పనులు చేపట్టే విధంగా తాము నివేదికలు కేంద్రానికి సమర్పిస్తామన్నారు. విశాలమైన గట్లు, వాటిపై పచ్చదనం పెంపొందించే విధంగా మొక్కలు నాటడం వలన పార్కును తలపించే ఆహ్లాదకరమైన వాతావరణం స్థానికులకు లభిస్తుందన్నారు. సుదీర్ఘకాలం మన్నిక ఉండేందుకుగాను ప్రణాళికాబద్ధంగా గట్లు బలహీనపడకుండా ఉండేందుకు స్టోన్ రివిట్మెంట్ తో పాటు చెక్ డాం, మధుములు ఇతర నిర్మాణాలు ముందు చూపుతో పనులు చేపట్టారని కేంద్ర బృందం కొనియాడింది. అనంతరం మోడల్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టిన విధానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా కేంద్ర బృందం పరిశీలించగా పనులు చేపట్టిన తీరును డ్వామా పిడి వివరించారు.