హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నీటిమట్టం 58.50 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం కరకట్టను తాకడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనావేస్తున్నారు..